Friday, April 24, 2009

బొడ్డెమ్మపండుగ(BODDEMMA FESTIVAL IN TELANGAANA)



తెలంగాణా ప్రాంతంలో పల్లె జానపదానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.తెలంగాణాకే పరిమితమైన రెండు పండుగలు బతుకమ్మ, బొడ్డెమ్మ. ఒకదాని వెంట ఒకటి వరుసగా జరుపుకొనే ఈ రెండు పండుగలు గౌరీ దేవికి సంబంధించినవే.. ఈ రెండింతిలో బతుకమ్మ పెద్దల పండుగైతే.. బొడ్డెమ్మ పిల్లల పండుగ. భాద్రపద బహుళ పంచమి మొదలుకొని మహాలయ అమావాస్య వరకు బొడ్డెమ్మను, మహాలయ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ద నవమి వరకు బతుకమ్మను జరుపుకుంటారు. తెలంగాణాలో సాధారణంగా ఈసమయానికి పంటలు చేతికి వస్తాయి. ధాన్యలక్ష్మి కళకళలాడుతుంటే స్త్రీ పురుషులు పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు ఇల్లు వాకిలి శుభ్రం చేసి సున్నం, జాజులతో అలికి ముగ్గులు పెట్టి రాబొయే పండుగలకు సన్నాహాలు చేస్తుంటారు. ఇదే సమ్యంలో పిల్లలు బొడ్డెమ్మను చేసి వాటిపై పూలు పెట్టి చప్పట్లు కొడుతూ ఆటలాడుతారు.
బొడ్డెమ్మకు ఆ పేరెలా వచ్చిందటే:
బొడ్డెమ్మ పేరుకు బొట్టె, బొడిప, బొటిమ, పొట్టి అనే పర్యాయ పదాలున్నాయి. వీటన్నింటికి చిన్న అని అర్థం. బొడ్డెమ్మ అంటే ధాన్య రాశి, ధాన్యపు కుప్ప, అత్తిచెట్టు అని కూడా అర్థం ఉంది. సంతానానికి వివాహానికి ఈ పండుగలో మేడిని పూజిస్తారు.
పూజావిధానం:
బొడ్డెమ్మను చెక్కపీటపై పేరుస్తారు. పుట్టమన్నుతో చతురస్రాకారంగా ఐదు దొంతరలు చేసి వాటిని ఒకదానిపై ఒకటి త్రుభుజాకారంగా పేరుస్తారు. ఉద్రాక్ష, కాకర, కట్ల, బీర, మల్లె, జాజి, మందార పూలతో అలంకరిస్తారు. శిఖర ప్రదేశాన బియ్యంతో నిండిన చిన్న కలశం, దానిపైన కొత్త రవికెలను పెట్టి తమలపాకు లోని పసుపు గౌరమ్మను పూజిస్తారు. చెక్కతోకూడా బొడ్డెమ్మను చేసి దానిపై నాలుగువైపులా నాలుగు మట్టి ముద్దలు పెట్టి పూలతో అలంకరించడం కూడా చేస్తారు. సాయంకాలం ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టి అక్కడ బొడ్డెమ్మను నిలుపుతారు. ఇరుగుపొరుగు బాలికలు , కన్నెపిల్లలంతా వచ్చి చప్పట్లు కొదుతూ పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఇలా ఆటపాటలతో గడిపి ఆతర్వాత పప్పు బెల్లం నైవేద్యంగా పెడుతారు. తర్వాత బొడ్డెమ్మను పూజా గృహంలో ఉంచి తొమ్మిదో రోజున నిమజ్జనం చేస్తారు.
బొడ్డెమ్మా బొడ్డెమ్మ.. వలలో
బిడ్డాలెందారే ..వలలో
నీ బిడ్డ నిత్యగౌరీ ..వలలో
నిత్యమల్లె చెట్టువేసీ.. వలలో