శ్రీశ్రీస్వాతంత్ర్యం, సమభావం - సౌభ్రాత్రం, సౌహార్దం..
పునాదులై ఇళ్లు లేచి - జనావళికి శుభం పూచి
శాంతి, శాంతి,కాంతి , శాంతి
జగమంతా జయిస్తుంది
ఈ స్వప్నం ఫలిస్తుంది "- శ్రీశ్రీ
"మానవుడు తన మంచి చెడ్డలకు తానేబాధ్యుడు. మానవ సంఘానికి తన పరిస్థితి తానూ చక్కదిద్దుకునే శక్తి ఉన్నాసామజిక చైతన్యం లేదు. అటువంటి చైతన్యం అందించడం కవిత్వం చేయాల్సిన పని " అంటూ జనం బాధలను తన బాధగా ప్రకటించిన మహాకవి శ్రీశ్రీ.తన ప్రతీ రచనలో కష్టాలకు క్రుంగిపోకుండా కదం తొక్కుతూ పదం పాడుతూ ముందుకు సాగామన్నాడు. ప్రాణత్యాగానికి సైతం వెనుకాడకుండా దారిపొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ సాగమని ధైర్యాన్ని నూరిపోసాడు . ప్రభంజనంలోని ఉధృతి, భావంలోని వేగం, నయాగరా జలపాతంలోని చైతన్యంతో ముందుకురకమని మరో ప్రపంచం వైపు మహాప్రస్థానాన్ని సాగించాలని బోధించాడు. పీడితులకు చైతన్యాన్నిచ్చి ముందుకు నడిపించే రచనా వ్యాసంగం శ్రీశ్రీది.
అపారమైన నవ్యుత్పత్తి, అనన్య సామాన్యమైన ప్రజ్ఞ , అనితర సాధ్యమైన సంవిధాన చాతుర్యం, అతులితమైన ఉద్యమ స్పూర్తి, అజేయమైన మానవతా విశ్వాసం .. ఇన్ని లక్షణాలు మూటగట్టుకున్న మన తెలుగు కవి శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీశ్రీ). ఒక శ్రీ కారం అభ్యుదయ ప్రస్తానానికైతే మరో శ్రీ కారం విప్లవ ప్రస్థానానికి ..
1910లో జన్మించిన శ్రీశ్రీ 1933నుంచి 1947వరకు రచించిన 41గీతాలు మహాప్రస్థానం గా అవతరించాయి. 1950జూన్ లో మొదటిసారి ముద్రితమైన ఈ రచన ఇప్పటివరకు 25సార్లు పునర్ముద్రితమైంది.