హైందవీ సంస్కృతీ వేద... భారతీ మాతృ శారదా |
శక్తిం ప్రదాతుమే వేద... భారతీ సుప్రకాశమే||
వేదోఖిల జగస్సర్వం నమామి వేదమాతరం
వేదాన్ని జీవన సంవిధానంగా మార్చుకున్న జాతి మనది. వేటగాడిని వేదర్షి వాల్మీకిని చేసిన చరిత మనది. వెన్నెముకను వజ్రాయుధంగా మలచిన యుక్తి మనది. గడ్డిపోచను ఆత్మబలంతో అస్త్రంగా తీర్చిదిద్దిన శక్తి మనది. భగవంతుడే జగద్గురువై 'గీత' మార్చిన రాత మనది. శూన్యం(సున్నా)తో గణాంకాలు రాశులు పోసిన ఘనత మనది. మూడుపదులకే ప్రపంచాన్ని మురిపించిన 'వివేకం' మనది. పోపులడబ్బాలో ఆయుర్వేద సారాన్ని కూర్చిన నైపుణ్యం మనది. అమ్మ చేతిలోనే అమృత వైద్యం అందించిన అద్భుతం మనది.
వాకిట్లో చల్లే కళ్లాపి, ఇంటి ముందటి వేపచెట్టు, గుమ్మానికి కట్టిన తోరణం, పెరట్లో పెరిగిన తులసి మొక్క, వంటింట్లో నలిగిన పసుపు, కాళ్లకు పెట్టుకునే వెండి పట్టీలు,దొడ్లో ఉండే ఆవుపాలు..మనం వాడే ప్రతిదీ ఔషధమే! అద్భుతమే! అమృతమే!
ఒకరికొకరుగా బతికే గ్రామీణ జీవన విధానం, పెద్దా చిన్నా కలసి పెరిగే సమిష్టి కుటుంబం, భయభక్తులు నేర్పే గురుకుల విద్య అబ్బురపరచే ఆధ్యాత్మిక సంపద, ప్రకృతిని పూజించే పండగలు, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించే కళారూపాలు, ఎవరిమీదా ఆధారపడకుండా కడుపు నింపే చేతి వృత్తి, ఉర్రూతలూపే జానపదం, తేనెలూరే తెలుగు, ఆధునిక కంప్యూటర్ కూ సరిపోయే అతి ప్రాచీన సంస్కృతం, ఎంత గొప్పది మన వారసత్వం?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment